Editorial: పొత్తులపై బీఆర్ఎస్ కూడికలు-తీసివేతలు

Editorial: పొత్తులపై బీఆర్ఎస్ కూడికలు-తీసివేతలు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు ఖాయమేనా? అందుకే అభ్యర్థుల జాబితా ప్రకటనలో గులాబీ బాస్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారా? లెఫ్ట్ పార్టీలకు ఎన్ని స్థానాలు ఇవ్వాలనే దానిపై చర్చలు జరుపుతున్నారా? ఇంతకూ లెఫ్ట్ పార్టీలతో బిఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే ఓట్ల బదిలీ జరుగుతుందా? లెఫ్ట్ పార్టీలు అడిగిన సీట్లు బీఆర్ఎస్‌ ఇస్తుందా?

తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని అధికార బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి నుండే గ్రౌండ్ ప్రిపేర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు గులాబీ బాస్. ఇక మునుగోడు ఉప ఎన్నికల సమయంలో సీపీఎం,సీపీఐ పార్టీలు బీఆర్ఎస్‌కి మద్దతు ఇచ్చాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తును కంటిన్యూ చేస్తామని ఇరు పార్టీల నేతలు అప్పట్లో ప్రకటించారు.

రాబోయే ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా సీపీఎం పార్టీ తమకు భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం, మధిర అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని కోరుతోంది. మరోవైపు సీపీఐ పార్టీ కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, మునుగోడు, బెల్లంపల్లి స్థానాలు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే లెఫ్ట్ పార్టీలు పొత్తుల్లో భాగంగా తమకు కావాలని కోరుతున్న స్థానాల్లో భద్రాచలం,మధిర మినహా మిగిలిన అన్ని స్థానాల్లో బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో సీట్ల సర్దుబాటు అధికార పార్టీకి తలకు మించిన భారంగా మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు లెఫ్ట్ పార్టీలతో పొత్తు కలిసొస్తుందని బీఆర్ఎస్ వర్గాలు అంచనావేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని అసెంబ్లీ స్థానాలను సీపీఎం,సీపీఐ పార్టీలకు ఇవ్వాలనే దానిపై సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్లుగా పార్టీలో టాక్ నడుస్తోంది. ఒక వేళ లెఫ్ట్ పార్టీలతో పొత్తు వుంటే బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓట్లు లెఫ్ట్ పార్టీల వారికి బదిలీ అవుతాయా అనే దానిపై గులాబీ పార్టీ లెక్కలు వేసుకుంటోంది.

సీపీఎం,సీపీఐ పార్టీలు అడిగినన్ని స్థానాలు కాకుండా చెరో రెండు లేదా మూడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక సీపీఎం పార్టీకి భద్రాచలం, మిర్యాలగూడ,మధిర అసెంబ్లీ స్థానాలు...ఇక సీపీఐ పార్టీకి వైరా,బెల్లంపల్లి,అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే సీపీఎం కు పాలేరు , సీపీఐ కి కొత్తగూడెం నుండి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లెఫ్ట్ పార్టీల రాష్ట్ర కార్యదర్శులకు ఆయా స్థానాలను బిఆర్ఎస్ పార్టీ ఇస్తుందా లేదా అనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. రెండు పార్టీలకు చెరో ఎమ్మెల్సీ స్థానం ఇచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

మొత్తానికి సీపీఎం,సీపీఐ పార్టీల నేతలు ఇప్పటికే పొత్తులపై మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ అపాయింమెంట్ కోరినప్పటికీ సమావేశం కాలేదు. బీఆర్ఎస్ మద్దతు ఇస్తే జరగనున్న పరిణామాలపై అధికార పార్టీ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తొలి జాబితా ప్రకటన నాటికి పొత్తులపై క్లారిటీ వస్తుందా.. లేదంటే ఎన్నికల నాటికైనా లెఫ్ట్ పార్టీలతో బిఆర్ఎస్ పార్టీకి పొత్తు పొడుస్తుందా...? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే

Tags

Read MoreRead Less
Next Story